ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది
- అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది
- మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన
- దాడి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం క్షేత్రస్థాయిలో ఒక తలనొప్పిగా మారుతోంది. ఉచిత ప్రయాణాల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి, మహిళా ప్రయాణికులకు మధ్య వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. దీనికి నిరసనగా కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు ఈ ఉదయం హఠాత్తుగా బస్సు సర్వీసులను నిలిపివేశారు.
డ్యూటీలో ఉన్న తమపై కొందరు మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తూ, దాడులకు దిగుతున్నారంటూ ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచే డిపో గేటు వద్ద బైఠాయించి బస్సులను బయటకు కదలనివ్వకుండా నిరసనకు దిగారు. ఈ హఠాత్ పరిణామంతో ఉదయాన్నే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వందలాది మంది విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సుల్లో రద్దీ నియంత్రణ లేని స్థాయికి చేరిందని సిబ్బంది తెలిపారు. సీట్ల సర్దుబాటు విషయంలో, అలాగే విపరీతమైన రద్దీ వల్ల బస్ స్టాప్ల వద్ద బస్సులు ఆపలేని క్రమంలో ప్రతిరోజూ మహిళలతో తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కొందరు మహిళలు ఏకంగా భౌతిక దాడులకు తెగబడుతున్నారని, తమకు కనీస రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమపై దాడులకు దిగుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని డిపో సిబ్బందికి విధి నిర్వహణలో పక్కా రక్షణ కల్పించేలా హామీ ఇచ్చేంత వరకు బస్సులు నడిపే ప్రసక్తే లేదని సిబ్బంది చెప్పారు. దీంతో అవనిగడ్డ డిపో పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.